ఈ వేళ మా అత్తగారి తిథి పెట్టడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. ఆవిడ వరసకి నాకు అమ్మమ్మకూడా అవుతారు.ఆవిడ 2007 లో 95 ఏట పోయారు.ఇప్పటికి 3 సంవత్సరాలయింది. ఏమిటో ఈవేళంతా ఆవిడగురించే ఆలోచనలు.
నా పెళ్ళై 38 ఏళ్ళయింది.అంటే నేను 35 సంవత్సరాలు కోడలుగా ఉన్నానన్నమాట!ఒక్కవిషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాల్ని, ఆవిడ నాచేతిలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.ఆవిడ దగ్గరనుండి ఎన్నో నేర్చుకున్నాను, జీవితం గురించి ఆవిడలో కలిగిన మార్పులూ వగైరా. మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది.
నా పెళ్ళై వచ్చి, నాకు శ్రీమంతం చెయ్యడం, ఆవిడ షష్ఠిపూర్తీ ఒకే రోజున అయ్యాయి.అప్పటికే మా ఇంట్లో నాకు ఇద్దరు తోడికోడళ్ళు.ఇంట్లో మాశ్రీవారే ఆఖరి కొడుకు,ఈయన తరువాత ఓ అమ్మాయీ.కోడలొచ్చిన వేళన్నట్లు,నా పెళ్ళి తరువాత, మా ఆడపడుచు పెళ్ళయింది. 1975 లో మా మామగారు పోయారు.అయినా ఆవిడ అమలాపురంలో లంకంత ఇంట్లో ఒక్కరే ఉండేవారు,కొన్ని వాటాలద్దెకిచ్చేసి.మా బావగారు చాలా కాలం దగ్గరలోనే ఉద్యోగం చేస్తూండడంవల్ల,ఆయనే ఎక్కువగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు.ఇంకో బావగారేమో హైదరాబాదు లో ఉండేవారు.మాకు ఏడాదికో రెండేళ్ళకో అక్కడికి వెళ్ళే వీలవుతూండేది.ఎప్పుడో చూడాలనిపించినప్పుడు, పూనా మా దగ్గరకి వస్తూండేవారు.మేము పిల్లలతో అమలాపురం వెళ్ళినప్పుడు మాత్రం,నన్ను పూచిక పుల్ల ముట్టుకోనిచ్చేవారుకాదు.వంటా వార్పూ ఆవిడే. "ఏం చేస్తావులెద్దూ, రోజూ పిల్లలకి చేసి అలిసిపోతూంటావు,ఇక్కడికి వచ్చినప్పుడైనా రెష్టు తీసికో" అనేవారు. ఉన్న వారంరోజులూ,ఏదో ఒకటి చేస్తూండడమే. ఎంతచెప్పినా సంవత్సరాలకొద్దీ ఇంకోళ్ళకి పెట్టిన చెయ్యి! అవతలివాళ్ళు చేస్తే మడీ,ఆచారం కుదరదు,అలాగని మరీ నన్ను మడికట్టుకుని చేయమని అడగడం ఎందుకూ అని! ఏదిఏమైనా నాకు అమలాపురం వెళ్తే మాత్రం హాయిగా ఉండేది.
మాకు వరంగాం ట్రాన్స్ఫర్ అయిన తరువాత, ఓ మూడు నెలలకి అక్కడికి వచ్చారు. అంతకుముందు, పూనా వచ్చినప్పుడల్లా, ఆవిడ మా అమ్మేమో అనుకునేవారు,పక్కవాళ్ళంతా!వరంగాం వచ్చేటప్పటికి, ముందుగానే చెప్పేశారు- నాకు 10.30 కి భోజనం పేట్టేయి తల్లీ, నాకు మీలాగ టిఫినీలూ వగైరా అలవాటులెవమ్మోయ్'-అని.మాకు అక్కడ క్వార్టర్ లో చుట్టూరా గార్డెనూ అదీ ఉండేది. దాంట్లో తులసి కోటా, పువ్వులచెట్లూ అన్నీ ఉండేవి.ప్రొద్దుటే ఆరింటికల్లా నిద్ర లేవడం అలవాటేమో, కొంచెం కష్టం అయేది,ప్రొద్దుటే ఈవిడా, పిల్లల్ని స్కూలుకి తయారుచెయ్యడం, ఆయన ఫాక్టరీకి తయారవడం, ఒక్కటే బాత్ రూమ్మూ. అందరికీ ఎవరిపనులు వాళ్ళకి అయిపోవాలి,ఎవరిని కాదంటే వాళ్ళకి విసుపులూ,కోపాలూ,
మీరే ఉహించుకోండి, మా ఇల్లెలా ఉండేదో!ఇంత హడావిడిలోనూ ఆవిడ స్నానం చేసేసి, తులసికోట దగ్గరకు వెళ్ళడం,దానిచుట్టూ ప్రదక్షిణలూ,బయట స్కూళ్ళకెళ్ళే పిల్లలకి తమాషాగా ఉండేది.పిల్లలు స్కూలుకీ,ఆయన డ్యూటీ కీ వెళ్ళగానే,కాఫీ త్రాగేసి,మళ్ళీ గార్డెన్లో చక్కర్లూ!ఇవన్నీ అయ్యేసరికి పదిన్నరా అయ్యేది.అప్పటికి స్నానం పానం పూజా పునస్కారం పూర్తిచేసికుని, ఆవిడకి పప్పూ,కూరా,ఓ పచ్చడీ ( మళ్ళీ ఊరగాయ కాదు!), పులుసూ పెట్టి భోజనం పెట్టడం!ఓ కునుకు తీసి, మళ్ళీ ఒంటిగంటన్నరకల్లా కాఫీ పడాల్సిందే. ఈ ప్రోగ్రాం అంతా ముందే చెప్పేశారు.ఆవిడకు కావలిసినట్టుగా చెయ్యకపోతే, ఆయన బాధపడతారేమో అని,అప్పుడప్పుడు కష్టమనిపించినా,ఎప్పుడూ నాగా మాత్రం పెట్టలేదు!అందుకనే ఈవిడను చూడ్డానికి వచ్చే తెలుగువారితో ఆవిడంటూడేవారు-' మా కోడలు, లోపల ఏమనుకున్నాసరే బాధ్యతగా అన్నీ టైముకి చేసేస్తూంటుంది. భోజనం పెట్టిందీ అంటే గడియారం చూసుకోనఖ్ఖర్లేదు, పదిన్నరయిందన్నమాటే!' అనేవారు.
ఎక్కడైనా ఎవరైనా పోయారని విన్నారో, ఇంక ఈవిడకి బెంగొచ్చేసేది, పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని, అంతే ఆయన్ని పట్టుకుని పీకేసేవారు!పోతే పెద్దకొడుకు చేతిలోనే పోవాలని.ఏమిటో అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా? మా పెద్ద బావగారు సడెన్ గా పోవడం, ఆవిడకో పెద్ద దెబ్బ. పెద్దబావగారు లేకపోవడంతో, అమలాపురం లో ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టేశారు. అప్పుడు మాత్రం ఆవిడ చాలా బాధపడ్డారు, మామూలు టీచర్ ఉద్యోగం చేస్తూ, పదిహేను గదుల ఇల్లు కట్టించడమంటే, మా మామగారు ఎంత కష్టపడ్డారో ఆవిడ కళ్ళారా చూశారు,అయినా సరే, ఆ ఇంట్లో ఏమేం సామాన్లెక్కడెక్కడున్నాయో ఓ కాగితం మీద వ్రాసి ఉంచారు.వాటన్నిటికీ కాళ్ళొచ్చేశాయి, అది వేరే సంగతి లెండి.
పెద్ద బావగారు పోయిన తరువాత, మాదగ్గరా, చిన్నబావగారిదగ్గరా ఉంటూండేవారు. దురదృష్టవశాత్తూ,మా చిన్న బావగారూ, ఆయనపోయిన ఏడాదిలోనే మనవడూ పోయేటప్పటికి, ఇంక ఆవిడ లో ఒక టైపు నిర్వికారం వచ్చేసింది.ప్రపంచంలో ఇంక ఇంతకంటె ఆ భగవంతుడు ఏం చెయ్యగలడూ అని.పోన్లే ఉన్న ఒక్క కొడుకు చేతిలోనన్నా పోయే అదృష్టం ఉండేలా చెయ్యి దేముడా, అనుకొని, మాదగ్గరకు వచ్చేశారు.
ఆవిడలో 35 సంవత్సరాలూ, ఆవిడలోని మార్పులన్నీ చూశాను, 60-70 ల్లో కొత్తకోడలుగానూ,70-80 ల్లో ఇద్దరు పిల్లల తల్లిగానూ,80-90 ల్లో ఓ అత్తగారి గానూ నాకెన్నో అనుభవాలున్నాయి ఆవిడతో. ఏం చెప్పినా, ఆవిడ చివరి నాలుగు సంవత్సరాలకీ, మా దగ్గరకు వచ్చేసరికి,ఆవిడని చూసి జాలి పడాలో, లేక ఎప్పటికైనా మనమూ అలాగే ఉంటామేమో అనే భయమో ఏదో తెలియదు, బాధ్యత మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.ఆవిడలో వచ్చిన మార్పు చూసి, ఎంతో నేర్చుకున్నాను, పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఎడ్జస్ట్ అవాలో, ఎలా ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుందో,అన్నీ ఆవిడను చూసే నేర్చుకున్నాను.
బాధ్యత నుంచే బంధం ఏర్పడుతుంది,బంధం నుంచే అనుబంధం ఏర్పడుతుంది. ఆవిడ పోయినప్పుడు, ఆవిడ మొహం మీది ప్రశాంతత చూసిన తరువాత, నేను తీసికున్న బాధ్యత సరీగ్గానే నిర్వర్తించాననే అనిపిస్తూంది. అందుకే ఇన్ని జ్ఞాపకాలు.